మాటంటే మాటే!
జనాలని కలిపే వంతెనలు మాటలు, అలాగే, విడగొట్టే కత్తులు కూడా మాటలే. మాటలతో యుక్తిగా సంబంధాలు క;లిపే,అగ్నిభట్టారకులూ,ఉంటారు,మాటలతో,పుల్లలు పేట్టి జనాలని విడగొట్టే,నారదమునులూ ఉంటారు.ఏమైనా,మాటలు రెండందాలా పనికొచ్చే అస్త్రాలే మరి.
మాటలు జాగ్రత్తగా రానీ....మాటమ్టే మాటే అంటూ మాటను పట్టుకు వేలాడే మనుజులు ,మనకు నిద్ర లేస్తే కోకొల్లలు. అసలు నిజానికి మాటల్లేనిదే మనుగడ ఉంటున్దా...? మన పిచ్చి కానీ...
మాటలెలా పుడతాయి ఎవరో ఒకరు కనిపెట్టకపోతే అని మాయబజార్ లో ఘటోత్కచుడి చేత అనిపించిన మాట వాస్తవమే, లేకుంటే ఏడాది రెండేండ్లు నిండిన పాప మాటలు చూడండి.ఏకమ్గా ఒక డిక్షనరీనే చేయచ్చు. క బదులు,త,స బదులు త ఇలా ఏదో ఒకటి మార్చేస్తూ క్రొత్త క్రొత్త మాటలు పుట్టించేస్తూ ఉంటారు పిల్లలు. అదో ముచ్చట.
"మాట జారితే తీసుకోలేము,కాలు జారితె తీసుకోవచ్చు " అని అనటానికి అంటామ్ కానీ,మాటకి ఆ పాటి విలువ పోయి చాన్నాళ్ళే అయిన్దని చెప్పొచ్చు.ఇవాళ్రేపు,రాజకీయ నాయకులు,ఎన్నెన్ని మాటలు,ఎంతలేసి మాటలయినా ,అనటానికి వెనుదీయరు,సరి కదా,అదే ప్రత్యర్ధి పార్టీలోకి మారి,అంతకు ముందరి పార్టీ వారిని,అదే నోటితో ,అవే మాటలతో చెరిగెయ్యగలరు.
మాటలతో ఎగస్పార్టీ నాయకుల బట్టలిప్పేయగలరు.
మాటల గారడీతో వోటర్లను మాయ చేయటం ,మన రాజకీయ నాయకులకి,వెన్నతో పెట్టిన విద్య మరి. అదే మాదిరి,మాటలు కోటలు దాటతాయి కానీ,చేతలు గడపలు దాటవంటూ పరస్పరం,విమర్శలు చేసుకోవటం కూడా,రాజకీయ నాయకుల్లో చూస్తూ ఉంటాం. "మాట మార్చం,మడమ త్రిప్పం", అనేది, ఒక రాజకీయనాయకుని,ఊతపదంగా కూడా మారిన మాట చూస్తున్నాం.
మాటల్లో మరిచిపోయాను,ఒకప్పుడు మాటల్లో మునిగి,వంటింట్లో గిన్నెలు మాడబెట్టిన సతీమణులు,మాటల్లో పడి రైలు మిస్సయిన ప్రయాణికులు,ఇలా మాటల్లో పడి పరేషానైనోళ్ళు చాలా మందే ఉండే వాళ్ళు.
,మాటకారితనం అనేది,ఒక గొప్ప లక్షణంగా ఎప్పుడూ చెలామణీ అవుతూనే ఉన్నది.
హనుమంతుడి మాటకారి తనాన్ని శ్రీ రాముడు మెచ్చుకున్న వైనం మనకి రామాయణంలో కనపడుతుంది. మాటల్లో నైపుణ్యం వలనే,రామదూత,లంకకు పోయి,సీతమ్మను ఓదార్చి,రావణుడి గర్వభంగం చేసి , ఓపికగా ఆ సభలో అందరు,తస్మదీయుల మధ్య అస్మదీయుడు,విభీశణుడిని కనుగొని ఇంకా ఇతర ఆనుపానులు కనుక్కుని,లంక నలుమూలలు కలియదిరిగి,చూసిరమ్మంటే కాల్చి వచ్చిన తీరు మనకి తెలిసిందే!
మాటలొచ్చిన వారినే ,రాయబారులుగా పంపే వారు,ఇంతకు మునుపు రాజులు.సంజయుడు,విదురుడు,ఒక రకమైన రాయబారులైతే,హనుమంతుడు,అంగదుడు,ఇంకొక రకమైన రాయబారులు.
కిట్టప్ప సంగతి చెప్పనే అక్కరలేదు. పాండవదూతగా, ఆయన మాటకారితనం,జగమెరిగిన సత్యం. సంధి చేయటానికన్నట్లే పోయి,ఎంచక్కా,తగవు పెట్టొచ్చాడంటారు ,రాజకీయం తెలిసిన చాలా మంది. మరి,... లోగుట్టు ఆ పెరుమాళుకే,ఎరుక.
మాటల్లో పెట్టి మిరపకాయల్ని సైతం, బంగారినికి ధీటుగా అమ్మే సేల్సుమెన్లు ,మనకి ఇప్పటికీ తారసపడుతూ ఉంటారు.కానీ,మాటలో నిజాయితీ ఉండాలంటూ,హటం చేసే వారు బంగారమిచ్చినా అమ్ముకుని రాలేకపోవటమ్ మనం చూస్తూనే ఉంటాం.
మాటల్లో పెట్టి ,అప్పు సంపాదించే,అప్పారావులు,మాటల్లో పెట్టి, అబ్బాయిలని ముగ్గులోకి దింపే,అమ్మాయిలు,అమ్మాయిలకి వల వేసే రోమియోలు,ఈ రోజుల్లో అంతగా కనపడటం లేదనే అనిపిస్తున్నది.
మాటలనేవి మాయమై ,ఏదో తప్పనిసరిగా మాట్లాడుకోవటమ్,యాంత్రికంగా,,ఒకరినొకరు పలకరించుకోవటమ్ చూస్తూ ఉంటే.ఒకప్పుడు,పిచ్చాపాటిగా,రైల్లోనో,బస్సుల్లోనో,కాకతాళీయంగా ,మాటలు కలిసి,సంబంధాలు కలుపుకునే వరకు పోయిన సందర్భాలు మరలా వస్తాయా అనిపిస్తూ ఉంటుంది.
మాటల వెనుక ఇంత పురాణం ఉంది. మాటలు రావాలంటే,సరస్వతీ కటాక్షం ఉండాలి.
పండితులు మాట్లాడితే,అందులో ఒక గాంభీర్యత ఉంటుంది. అందులో ఏదో లోతైన అర్ధమ్ ఉంటుంది. వాచాలురు మాట్లాడితే, కంచు మల్లే శబ్ధమ్ రావచ్చు గానీ, అందులో కంటెంట్ ఉండే మాట అరుదే.
మాటే మంత్రమూ,అంటూ ఒక సినిమా కవి బహుశా, ఈ పండితుల గురించే కాబోలు అన్నాడు.
మాటకి నిలబడి అడవులకి పోయిన రాముడు,ఆలుబిడ్డలని అమ్మేసి,తనను తాను అమ్ముకున్న సత్యహరిశ్చంద్రుడు,ఏదో,సత్యకాలం లో ఉన్నారు కానీ,ఇప్పుడు,మాట మీద ఎవరూ నిలబడటం లేదనే అనుకోవాలి. మాటల గారడీ చేసి ,బురిడీ కొట్టించి,తన వాళ్ళనే అమ్మేసే మోడర్న్ రాముళ్ళు,హరిశ్చన్ద్రులు వచ్చేసారు.
మాట తూలడం రివాజైన ఈ కాలం లో మాట విలువ గురించి ఇన్ని మాటలు మాట్లాడుకోవటమంటే, మాటలు వేస్టు చేసుకోవటమ్,టైం వేస్టు చేసుకోవటమే. ఇంక ఈ పూటకి ,ఈ మాటల ,మాటలకి స్వస్తి చెప్పేద్దాం.
శ్రీ
Comments
Post a Comment